TRS Samburaalu- A Positive Perspective సోమవారం, జూలై 9 2007 

తెలంగాణ సంబురాలు 

కాసుల ప్రతాప రెడ్డి వ్యాసము ఆసక్తికరమయిన అంశాలను ముందుకు తెస్తుంధి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిర్వహించిన ‘తెలంగాణ సంబురాలను’ (భువనగిరిలో, హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము కొరకు ఉద్యమిస్తున్న ప్రజల ఆత్మగౌరవ ప్రకటనగా, ఉద్యమానికి స్ఫూర్తి నిఛ్ఛే ప్రక్రియగా మాత్రమే కాక పర్యాటక రంగం దృష్టికోణంతో కూడా సంబురాలను పరిశేలించింది.

పర్యాటకులకొరకు రాసే travelogueగా చూసినప్పుడు చక్కని వ్యాసంలాగుంది. వివిద కోణాలనుంచి మరో మారు “తెలంగాణ సంబురాలు” కళ్ళకు కట్టినట్ట్లుంది. వివరణాత్మకంగానూ ఉంది. “వంటకాల ప్రదర్శన దక్కనీ సంస్కృతిని ప్రతిబింబించింది. తీరొక్క రీతుల వంటకాలు సందర్శకుల నోళ్లను ఊరించడమే కాకుండా తమ వైశిష్ట్యాన్ని ప్రకటించుకున్నాయి. వీటిలో నవాబుల వంటకాలు కూడా ఉన్న మాట వాస్తవమే” (అవి ఎందుకున్నాయో ఆ వివరణ కూడా ఉంది).

ఒక వైపు అంతర్గత వలసాధిపత్యవర్గాల దోపిడికి, మరోవైపు ఈ వర్గాల దళారీతనంతో రంగప్రవేశం చేసిన ప్రపంచీకరణ విధానాలు తెలంగాణను ఒక ‘దయ్యాల కొంప’గా మార్చేసి స్థానికులను చావులకో, వలసలకో పురికొల్పుతున్న సమయంలో ఈ దోపిడీ “ప్రక్రియను అడ్డుకోవాల్సిన పెద్ద బాధ్యత తెలంగాణ ఉద్యమంపై వుండగా, ఇన్ని సమస్యలు చుట్టు ముట్టుతుండగా తెలంగాణ సంబురాలంటూ ఊరేగడం ఏమిటనే ప్రశ్న న్యాయమైంది కూడా” అంటూ సంబురాల ఔచిత్యాన్ని నిలదీస్తున్నప్పటికి జవాబు మాత్రము వినూత్నంగా ఉంది.

ఇదే ప్రశ్న ఈ పత్రికలో శ్రీ నాగోబా లేవనెత్తడెమే కాక యుద్ధ రంగము నుంచి పారిపోయి సైనికుడు కాళ్ళకు గజ్జెకట్టడ మేమిటని (ఉద్యమ నిర్మాణం మరిచి సంబురాలను నిర్వహించడము) తీవ్ర స్తాయిలో నిరసించించినారు. నాగోబా ప్రశ్నకు కాసుల ప్రతాప రెడ్డి జవాబివ్వలేదు. సరికదా నాగోబాతో అంగీకరిస్తూ ఏవో కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయని చెప్ప ప్రయత్నించినారు.

నాగోబాగారు చెప్పినవన్నీ మిక్కిలి నిజమయినప్పటికీ కొన్నయినా సానుకూలాంశాలు లేకపోలెదన్నట్లు చాలా ఆసక్తిగా వివరిస్తారు సంబురాలను సంబ్రంగా

లాభ నష్టాలను లెక్క కట్టినట్ట్లు ఒక వ్యాసం తయారయినది.
ఆ చిట్టా ప్రకారము తెలంగాణ సంబురాల వలన ఈ క్రింది లాభాలు కలవని తెలుసుకోగల్గుతాము. అవి ఏమనగా

అ) సంబురాలు తెలంగాణ సమాజం ఆత్మగౌరవ ప్రకటన
ఆ) కళారూపాలు ప్రజలు చేస్తున్న పోరాటానికి స్ఫూర్తినిస్తాయి
ఇ) వర్తమాన పరిస్థితిలో విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్న పర్యాటక రంగం కోణం నుంచి సంబురాలకు ప్రాధాన్యత కలదు
ఈ) స్థానికులకే కాకుండా స్థానికేతరులకు ఒక రిక్రియేషన్‌లాగా ఈ కళా ప్రదర్శనలు అద్భుతంగా ఉపయోగపడే పరిస్థితి రావచ్చు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ఒక అద్భుతావహ, అనందకర జాతరలా వెలుగొందాలి
ఉ) నిజాం కళాశాల మైదానంలో ఉచితంగా ప్రదర్షించడంవల్ల ఈ కళారూపాల్లొ దాగి వున్న సౌందర్యం మొదటిసారి చాలా మందికి రుచి చూపించినట్లయింది.
ఊ) అద్బుతమయిన ఈ జానపద కళారూపాల ప్రదర్శనకు ఒక గౌరవాన్ని ఆపాదించాల్సి అవసరం వుంది, అది ఇలా ప్రదర్శనల ద్వారా కూడా సాద్య మవుతుంది
ఎ) కళాప్రదర్శనలకు విలువను సంతరించిపెట్టడం ద్వారా కళాకారులకు విలువలను, గౌరవాన్ని సంపాదించిపెట్టగలం.
ఏ) కళల పట్ల మన బాధ్యతను గుర్తు చేయడం -జానపద కళాకారులకు వ్యక్తిత్వాన్ని, ఆత్మస్థయిర్యాన్ని అందించాల్సిన బాధ్యత మనందరికీ వుంది. ఇలాంటి ప్రదర్శనలు ఆ బాధ్యతను మనకు ఎపుడూ నుర్తుండేలా చేస్తాయి
ఐ) సంబురాలు తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి, ఆయా రంగాల్లోని కళాకారులకు, వృత్తిపనులవారికి గౌరవాన్ని సంపాదించి పెట్టడానికి ఉపయోగపడుతాయి

అయితే అవి “సంబురాలా ” లేదా “సంబూరాలా” అన్న చర్చను ప్రస్తావించకుండా చివరకు మీడియా ప్రపంచం అంతా సంబురాలను ఒప్పుకున్న విశయాన్ని కూడ ఈ సంబురాల విజయాల లెక్కల్లో కలపటము మరవొద్దని మరీ గుర్తు చేస్తుంది.

ఈ వ్యాసం చదివాక రాంగ బోంగ ఏధయిన సమస్యకు జవాబు చెప్పిందా లేకపోతె ఎవరికైనా కొంతనన్న సముదాయించిందా అని మాత్రం అదగొద్దు.
అడిగితే ప్రశ్న మల్ల మొదలయితది!

…………………………………………………………………………..

Article of Kasula Pratapa Reddy   (Telangana Times, May 2007)

తెలంగాణ సంబురాలు : ముందుకొచ్చిన కోణాలు

– కాసుల ప్రతాపరెడ్డి

తెలంగాణ నేలమీద వెలిసిన లక్ష చందమామలు
ఆడబిడ్డల కండ్లల్ల మొలిచిన కోటి స్వప్నాలు
” – అని ఒక తెలంగాణ కవి బతుకమ్మ పండుగను గానం చేస్తాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అంతర్భాగంగానూ, దాని కన్నా మించిన విస్తృతితోనూ వచ్చిన తెలంగాణ అస్తిత్వ ఉద్యమం పాత వస్తును కొత్తరీతిలో సాక్షాత్కరింపజేస్తుంది. బతుకమ్మ పర్వదినం గురించి తెలంగాణ కవులు ఎంత మంది గానం చేశారో చెప్పడం కూడా కష్టమే. బతుకమ్మ తెలంగాణ జీవనశైలికి, సాంస్కృతిక విలక్షణతకు ఒక ప్రతీక అయింది.ఇలా తెలంగాణ ప్రత్యేకత గురించి, విశిష్టత గురించి గానం చేయడం ఒక ఆత్మగౌరవ ప్రకటన.ఈ ఆత్మగౌరవ ప్రకటన ఉద్యమానికి స్ఫూర్తి ఇవ్వడమే కాకుండా మనిషికి ఆత్మస్థయిర్యాన్ని అందిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నల్లగొండ జిల్లా భువనగిరిలోనూ, హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలోనూ నిర్వహించిన ‘తెలంగాణ సంబురాలు’ కార్యక్రమాన్ని ఈ దృష్టికోణంతో చూడాల్సి వుంటుంది. దీనికి మరో సానుకూల కోణం కూడా వుంది. పర్యాటక రంగం విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్న వర్తమాన పరిస్థితికి సంబంధించిన కోణం.

తెలంగాణ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కొల్లగొడుతున్న మాట వాస్తవమే. రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి బాధాకరమే. ప్రభుత్వ విధానాలు తెలంగాణ ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తూ నిత్య అగ్నిగుండంగా మారుస్తున్న వైనం మనకు తెలియంది కాదు. సమస్యలు చుట్టుముడుతుంటే తల్లడిల్లుతున్న జీవితాలను చూసి మనసు ఉసూరుమంటుంది. ఒక నిస్సహాయత మనసునూ, దేహాన్నీ ఆవరించి గుండెలో ఎవరో చెయ్యి వేసి కెలికినట్లుంటుంది. ఒక వైపు అంతర్గత వలసాధిపత్యవర్గాలు తెలంగాణను కొల్లగొడు తున్నాయి. మరోవైపు ఈ వర్గాల దళారీతనంతో రంగప్రవేశం చేసిన ప్రపంచీకరణ విధానాలు తెలంగాణను కబళిస్తున్నాయి. ఈ రకంగా తెలంగాణను ఒక ‘దయ్యాల కొంప’గా మార్చేసి స్థానికులను చావులకో, వలసలకో పురికొల్పుతున్నాయి. నిరంతరంగా కొనసాగుతున్న ఈ ప్రక్రియను అడ్డుకోవాల్సిన పెద్ద బాధ్యత తెలంగాణ ఉద్యమంపై వున్న మాట వాస్తవమే. ఇంత బాధ్యత వుండగా, ఇన్ని సమస్యలు చుట్టుముట్టుడుతుండగా తెలంగాణ సంబురాలంటూ ఊరేగడం ఏమిటనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఈ ప్రశ్న న్యాయమైంది కూడా. ఇదే సమయంలో ఇతర విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇంతకు ముందే చెప్పినట్లు మనిషికి ఆత్మగౌరవ ప్రకటన, ఆత్మాభివ్యక్తికి అవసరమైన ప్రజాస్వామిక వాతావరణం అవసరం. మనిషికే కాదు, ఒక సమాజానికి కూడా ఇవి ప్రాణధాతువులు. ఈ దృష్టికోణం నుంచి తెలంగాణ సంబురాలను చూడాల్సి వుంటుంది.

హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో జరిగిన సంబురాలు తెలంగాణ సమాజం ఆత్మగౌరవ ప్రకటన. తాను చేస్తున్న పోరాటానికి స్ఫూర్తినిచ్చే భావోద్వేగపూరితమైన ఉచ్చ్వాసనిశ్వాసాలు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జానపద కళాకారులు తమ ప్రకటించుకున్న కళాకౌశలమే కాకుండా ఆత్మాభిమాన వ్యక్తీకరణ కూడా. ఈ కళారూపాల్లో సామాజిక అంతర్వులు వ్యక్తమయ్యే మాట కూడా వాస్తవమే. విలువలకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఇమిడి వుంటాయి. విలువలను తలకిందులు చేయడమే మన కర్తవ్యమైతే, తెలంగాణ జానపద కళాకారులు ఉన్నతస్థాయిని పొందే విలువలకు మనం శ్రీకారం చుట్టాల్సి వుంటుంది. జానపద కళారూపాల్లో వ్యక్తమయ్యే ప్రతికూలాంశాలను విశ్లేషించి, వాటిని చూడాల్సిన కోణాన్ని మేధావులు సమాజానికి అందించాల్సి వుంటుంది. ఆ కళారూపాల కళాసౌందర్యాన్ని మాత్రం ఆస్వాదించడం, తర్వాతి తరాలకు అందించడం అవసరమే. ఆ రకంగా సినిమాలు, ఇతరేతర యాంత్రిక కళారూపాలుగా ధీటుగా వీటిని నిలబెట్టాల్సి వుంటుంది. జానపద కళారూపాల్లో అబ్బురపరిచే సృజనాత్మకత, ఆశ్చర్యపరిచే అద్భుతావహ అంశాలు వుంటాయి. ఏ సినీ కళాకారుడికి కూడా ఇప్పటి వరకు అందని అనేక కళాంశాలు వీటిలో వున్నాయి. వాటిని విడమరిచి, కన్నులకు కట్టినట్లు చూపించి ఆ కళారూపాల ప్రదర్శనకు ఒక గౌరవాన్ని ఆపాదించాల్సి అవసరం వుంటుంది.

కళలు మార్పులకు లోను కావడం, కొన్ని కొత్త కళలు వచ్చి పాత కళలను రూపుమాపడం సహజంగా జరిగేదే. ఈ క్రమంలో కళాకారుల జీవితాలు ఛిద్రం కావడం మనం చూస్తూనే వున్నాం. ఈ రకమైన విధ్వంసాన్ని పెద్దింటి అశోక్‌కుమార్‌ కథలుగా రాశారు.అయితే అణచివేతకు, సామాజిక అసమానతలకు, ఇతరేతర మానవీయ వ్యతిరేక అంశాలను బతికించాలనేది ఈ కథల ఉద్దేశం కాదు, మన ఉద్దేశం కూడా కాకూడదు. అయితే ఆ కళాప్రదర్శనలకు విలువను సంతరించిపెట్టడం ద్వారా కళాకారులకు విలువలను, గౌరవాన్ని సంపాదించిపెట్టగలం. నిజాం కళాశాల మైదానంలో ఉచితంగా ఈ కళాప్రదర్శనలను తిలకించే అవకాశం ఎంతో మందికి వచ్చింది. బహుశా చాలా మంది వాటిని ఇది వరకు చూసి వుండరు. అలా చూడనివారికి ఈ కళల అందం, అందులో దాగి వున్న సౌందర్యం మొదటిసారి నిజాం కళాశాల మైదానంలో రుచి చూపించినట్లయింది. ఇది వరకు చూసి జ్ఞాపకాల పొరల్లోంచి తొలగించుకున్నవారు వాటిని చూసి మళ్లీ ఆనందానుభూతులకు లోనయ్యారు. స్థానికులకే కాకుండా స్థానికేతరులకు ఒక రిక్రియేషన్‌లాగా ఈ కళా ప్రదర్శనలు అద్భుతంగా ఉపయోగపడే పరిస్థితి రావచ్చు. ఈ క్రమంలో వాటి మీద ఆధారపడిన కళాకారులు ఆదాయం సమకూర్చుకుని ఆర్థిక స్వావలంబన సాధించే కళాకూటములుగా ఏర్పడే అవకాశాన్ని పెంపొందించాలి. ఆర్థిక పరిపుష్టి మనిషికి ఆత్మస్థయిర్యాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది. తెలంగాణ జానపద కళాకారులకు ఆ విధమైన వ్యక్తిత్వాన్ని, ఆత్మస్థయిర్యాన్ని అందించాల్సిన బాధ్యత మనందరికీ వుంది. జానపద కళాకారులు లిఖిత సాహిత్యకారుల కన్నా, మేధావుల కన్నా ఉన్నతమైన గౌరవాన్ని పొందాల్సి వుంటుంది. ఈ కళలు, సాహిత్యం లిఖిత సాహిత్యకారులకు ముడిసరుకు కావాల్సిన అవసరం కూడా వుంది. స్థానిక కళలు, కళాకారులు గౌరవం పొందినప్పుడే ఏ ప్రాంతానికైనా ప్రత్యేక ఉనికి, ఆస్తిత్వం, గౌరవం ఏర్పడుతాయి. శిల్పారామంలో జరిగే కృత్రిమ, యాంత్రిక ప్రదర్శనలకు సహజాతిసహజమైన రీతిలో, వాతావరణంలో జరిగే ప్రదర్శనలకు మధ్య గల తేడా ఏమిటో తెలిసి రావాల్సే వుంటుంది. మిద్దె రాములు రేణుకా ఎల్లమ్మ కథా ప్రదర్శన కలిగించే రసానుభూతి ఏ హాలీవుడ్‌ సినిమాకు తక్కువది కాదు. ఇందులో కళాకారుడి ప్రతిభ, నేర్పు, కళాసౌందర్యం ఇమిడి వున్నాయి. తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో ఇదంతా ఒక ప్రధాన భాగమే. ఈ జానపద కళారూపాల ప్రదర్శన అనేది జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ఒక అద్భుతావహ, అనందకర జాతరలా వెలుగొందాలి. నిజాం కళాశాల మైదానంలో జరిగిన తెలంగాణ సంబురాలు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.

ఇక రెండో విషయానికి వస్తే, పర్యాటక స్థలాల అభివృద్ధి పేరుతో జరుగుతున్న కృత్రిమ, యాంత్రిక పరిణామాలను మనం హైదరాబాద్‌లో చూస్తూనే వున్నాం. నెక్లెస్‌ రోడ్డు ఆహ్లాదకరమైన పర్యాటక కూడలిగా కాకుండా వ్యాపార కళా కూడలిగా ఎలా పనిచేస్తున్నదో మన అనుభవంలో వున్నదే. హైదరాబాద్‌ స్థానికులు ఈ కూడలిని ఇష్టపడిన సందర్భాలు తక్కువే వుంటాయి. హైదరాబాద్‌లోని పలు చారిత్రక సుందర ప్రదేశాలను పర్యాటక స్థలాలుగా తీర్చిదద్దాల్సిన వలస పాలకులు హైదరాబాద్‌ను విధ్వంసం చేస్తూ నాలుగు వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన అనేక కట్టడాలను నిర్దయగా కూల్చివేస్తుండడాన్ని చూస్తూనే వున్నాం. ఇదే విషయం వంటకాలకు కూడా వర్తిస్తుంది.

నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వంటకాల ప్రదర్శన దక్కనీ సంస్కృతిని ప్రతిబింబించింది. తీరొక్క రీతుల వంటకాలు సందర్శకుల నోళ్లను ఊరించడమే కాకుండా తమ వైశిష్ట్యాన్ని ప్రకటించుకున్నాయి. వీటిలో నవాబుల వంటకాలు కూడా ఉన్న మాట వాస్తవమే. హైదరాబాద్‌ సంస్కృతి నవాబుల సంస్కృతిని తనలో లీనం చేసుకుంది. దీన్ని కాదనలేం. హైదరాబాద్‌ ఒక్క నవాబుల సంస్కృతినే కాదు, ప్రపంచంలోని వివిధ దేశాల, జాతుల సంస్కృతిని కలుపుకుంది. ఇతర ప్రాంతాలవారు హైదరాబాద్‌ను అంతగా ప్రేమించడం అందుకే. సరోజినీనాయుడు హైదరాబాద్‌ గాజులపై కవిత్వం రాయడం మన అనుభవంలో వుందే. ప్రముఖ చిత్రకారుడు హుస్సేన్‌కూ హైదరాబాద్‌కు ఉన్న అనుబంధం తెలిసిందే. తెలంగాణ గ్రామీణ వంటకాలు, హైదరాబాద్‌ నగర వంటకాలు కలగలిసి ఒక విశిష్టమైన విభిన్న రుచుల సమాహారంగా వంటకాల ప్రదర్శన వెలుగొందింది. జెల్లెల పులుసు, జొన్నరొట్టె, తైదంబలి – ఇలా ఆకర్షణీయమైన పేర్లతో కూడిన వంటకాలు స్థానికులను గత స్మృతుల్లోకి తీసుకొని పోతే, స్థానికేతరులకు వాటి రుచిని, ఆరోగ్యలక్షణాల్ని అందించాయి. పర్యాటక రంగంలో వంటకాలు కూడా ఒక ప్రత్యేకమైన అంశంగా నేడు తెర మీదికి వచ్చాయి. ఈ దృష్ట్యా తెలంగాణ వంటకాల వైశిష్ట్యాన్ని ప్రదర్శించాల్సే వుంటుంది. స్థానిక వంటలకు గిరాకీ పెంచి తెలంగాణ తన ఆత్మగౌరవ ప్రకటన చేయాల్సిందే. వ్యాపారం, ఆత్మగౌరవం కలగలిసిన మానవావసరమైన సంస్కృతికి విలువను పెంచాల్సిందే.

ఈ సంబురాలు తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి, ఆయా రంగాల్లోని కళాకారులకు, వృత్తిపనులవారికి గౌరవాన్ని సంపాదించి పెట్టడానికి ఉపయోగపడుతూనే తెలంగాణ ఉద్యమాలకు ప్రజల మనస్సులను సమాయత్తం చేసే వేదికలుగా మారాల్సిందే. ప్రజాసమస్యల మీద చేసే ఆర్థిక పోరాటాలు ఫలితాలు సాధించలేక కేవలం నిరసనలకు ప్రతీకలుగా మారిపోయాయి.ఈ దృష్ట్యా మానవ సహజాతాలను తిరిగి మేల్కొల్పాల్సే వుంది. పోరాటాలు ఒక జాతరగా మారాల్సిన సందర్భం ఇది. ఈ రకంగా చూసినప్పుడు తెలంగాణ సంబురాలు నేటి ఉద్యమ అవసరాలు.

ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలె. అనేక తెలంగాణ సాంస్కృతిక, భాషా వ్యక్తీకరణలు ఇప్పుడు ఆమోదయోగ్యతను, గౌరవాన్ని పొందుతున్నాయి. అటువంటివాటిలో సంబురాలు ఒక్కటి. బహుశా ఈ పదం వాడినప్పుడు ఆధిపత్యవర్గాలు చిన్నచూపుతో అగౌరవపరచాలని ప్రయత్నించే వుంటాయి. సంబరాలు అనాలి గానీ సంబురాలు ఏమిటని వెక్కిరించే ప్రయత్నం కూడా చేసే వుంటారు. ఈ రకమైన హేళనలను పట్టించుకోకుండా, న్యూనతా భావాన్ని విడనాడి వాడడం వల్ల సంబురం అనే పదాన్ని మీడియా అంతా వాడాల్సిన అగత్యం ఏర్పడింది. ఆ రకంగా ఆ పదం తెలంగాణకు గౌరవాన్ని ఆపాదించి పెట్టింది. ఈ విధమైన వ్యక్తీకరణలకు జానపద కళారూపాలు విశిష్టమైన వాహికలు. భాషను, సంస్కృతిని గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టుకోవడం, వాటికి ఆమోదయోగ్యతను సంతరింప జేసుకోవడం కూడా ఉద్యమంలో భాగమే. ఆర్థిక సమస్యల పరిష్కారానికి, ఆర్థిక ఉద్యమాల కొనసాగింపునకు సాంస్కృతిక ఉద్యమాలు ప్రధాన వాహికలుగా మారాల్సిన సందర్భం ఇది. ప్రజాస్వామిక, సాంస్కృతిక ఉద్యమాలను సమాంతరంగా నడిపించకుండా ఆర్థిక, రాజకీయ పోరాటాలను ముందుకు తీసుకొని పోవడం దుర్లభమైన సందర్భం కూడా. ఈ సమయంలో లాటిన్‌ అమెరికా దేశాల్లో జరుగుతున్న పోరాటాలను మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. మధ్యతరగతి ఉద్యమాలు విస్తరిల్లాల్సిందే

…………………………………….

visit Telangana Times for Nagoba’s comment on TRS Samburaalu

http://www.times.discover-telangana.org/2007/05/separate_telangana_movement_priorities/

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: