చిత్రకారుడు భరత్ భూషణ్

– C B Rao


Inaguration of Exhibition Photo:cbrao

శుక్రవారం, 23 నవంబరు 2007 సాయంత్రం ఆరున్నర గంటలకు, మాసాబ్ టాంక్ లోని లక్ష్మన్ ఆర్ట్ గాలరి లో, ఒక విచిత్రం జరిగింది. ఇంతవరకు ఛాయా చిత్రకారుడిగా చిరపరిచితమైన భరత్ భూషణ్ గుడిమిల్ల, రంగుల కాన్వాస్ తో కూడిన చిత్రకారుడిగా పరిచయ మయ్యారు. ఈ మార్పు ఆశ్చర్యకరమైనా, ఆహ్వానించ తగినది. కొంతకాలం అనారోగ్యం, బయటకు కదలనీయక పోవటంతో, ఆ సమయాన్ని, సృజనాత్మకంగా, చిత్రలేఖనానికి ఉపయోగించారు భరత్ భూషణ్.


Bharath Bhushan at Painting Exhibition Photo: cbrao

ఓరుగల్లు లో పుట్టి పెరిగిన, భరత్ భూషణ్ కు బాల్యం నుంచీ, తెలంగాణా పండగలు, సంస్కృతి పై మక్కువ ఎక్కువ. బతుకమ్మ పండుగలో బొడ్డెమ్మ దేవత చుట్టూ గ్రామీణ యువతులు చేసే ఆట – పాట, రంగుల పూలు, పండుగకు భూషణ్ అమ్మమ్మ చేసే మిఠాయిలు, కొనిచ్చే బూరలు, ఇవన్నీ భూషణ్ మదిలో చెరగని ముద్ర వేశాయి. ఆ రంగుల పూల పై మమకారాం, భూషణ్ ను తరువాతి జీవితంలో ఒక మంచి ఛాయచిత్రకారుడిగా మలిచింది. బతుకమ్మ పండగ ఉత్సవాలపై వరుసగా నాలుగేళ్లు చిత్రాలు తీసి, పండగలో కాల క్రమేణా సహజ పూల స్థానంలో ప్లాస్టిక్ పూలు రావటాన్ని వేదనతో గమనించారు. బతుకమ్మ పండగ గురించి భూషణ్ మాటల్లో వినండి.


Video Courtesy: Bharat Bhushan

ఆంధ్ర జ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం పత్రికలలో భూషణ్ పని చేశారు. ఇండియా టుడే, హిందూ (ఫొలియో), ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, ఏసియన్ ఫొటోగ్రఫీ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వగైరా పత్రికలలో భూషణ్ చిత్రాలు వచ్చాయి. తెలంగాణా పండగలు, జాతరల్లకు వీరి చిత్రాలు జాతీయ గుర్తింపు తెస్తే, బతకమ్మ పండగపై వీరి వ్యాసం, చిత్రాలు, ప్రదర్శన ఆ పండగకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం లో భాగమైన ఈ పండగను ప్రస్తుతం అంతర్జాతీయంగా, అమెరికా లోని ముఖ్య పట్టణాలలో జరుపుకుంటం వెనుక వీరి కృషి వుంది. మా భూమి (గౌతం ఘోష్), కాంచన సీత (జి అరవిందన్), రంగుల కల (బి నర్సింగ రావు) వగైరా చిత్రాలకు నిశ్చల చాయాచిత్రాలు తీశారు.

`Bathukamma: a Photographic Journey Into Telangana’s Water Festival’ అనే బతుకమ్మ పండగపై చిత్రాల ప్రదర్శన, ఇక్రిశాట్ వారు, వారి కార్యాలయం, పఠాన్‌చెరువులో 2005 లో ఏర్పాటు చేశారు. వోల్గా ఆధ్వర్యం లో Asmita-Resource Centre for Women వారు, Girl -child అనే భావనపై Y.W.C.A., Secunderabad లో, 2002 లో భరత్ భూషణ్ చిత్రాలు కొని, ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇదే సంస్థ వారు గతంలో మహిళావరణం అనే పుస్తకానికి భరత్ తీసిన నలుపు తెలుపు చిత్రాలు వాడారు. వివిధ రంగాలలో ప్రముఖులైన మహిళామణుల జీవిత చిత్రణలతో నిండి వుందీ పుస్తకం. ఈ పుస్తకం కోసం, సారా వ్యతిరేకోద్యమానికి నాంది పలికిన దూబగుంట రోశమ్మ మొదలు, సినీ నటి శారద నుంచి కోనేరు హంపీ దాక భిన్న రంగాలలో ప్రసిద్ధులైన వారందరి చిత్రాలు భూషణ్ ఎంతో సృజనాత్మకంగా తీసారు. స్త్రీ దృక్కొణం లో స్త్రీల సమస్యలను అధ్యయనం చేసే అవకాశం అస్మిత ద్వారా భరత్ కు కలిగింది. భరత్ కాన్సర్ బారిన పడినప్పుడు అస్మిత ఆర్థికంగా ఆదుకొంది. వీరు, 2007 లో, ఆంధ్రప్రదేష్ ప్రెస్ ఫొటోగ్రాఫర్స్ సంఘం వారు నిర్వహించిన, రాష్ట్ర స్థాయి ప్రెస్ ఫొటోగ్రాఫర్ల పోటీకి న్యాయనిర్ణెతలలో ఒకరిగా వ్యవహరించారు.

భరత్ చిత్రకళ తన ఛాయాచిత్రగ్రహణలోంచి ప్రేరణ పొందినదే. ఈ దిగువ చిత్రాలు గమనించండి.


Image Courtesy: Bharat Bhushan

ఒకటి దూబగుంట రోశమ్మ చేటలో బియ్యం ఏరుకుంటూ వుండగా తీసిన గ్రామీణ నేపధ్యం లోని చిత్రం.


Image courtesy: Bharath Bhushan

ఆ తదుపరి పెయింటింగ్ మరల గ్రామీణ నేపధ్యం ఆధారంగా చిత్రీకరించినదే. ఈ రెండింటిలోను ఎంత సామ్యం వుందో గమనించారా? ఈ రోజు ప్రదర్శనకు వుంచినవన్నీ, గ్రామీణ నేపధ్యాన్ని కంటికి కట్టినట్టుగా చూపిస్తాయి. మనలను తెలంగాణాలోని పల్లెకు తీసుకెళ్తాయా చిత్రాలు.


Director B.Narsing Rao of Daasi & Rangula kala fame with cbrao Photo:cbrao

ఈ చిత్రాల ప్రదర్శనను, జ్యోతి ప్రజ్వలనం గావించి, ప్రముఖ కళా విమర్శకుడు జగదీష్ మిట్టల్ ప్రారంభించారు. పలువురు సాహితీ మిత్రులు, చిత్రకారులు ఈ ప్రదర్శనకు వచ్చినవారిలో వున్నారు. చాయాగ్రహణం వలే, భరత్ భూషణ్ చిత్రకళ కూడా, పలువురి మన్నలను పొందగలదు.

 

source : http://deeptidhaara.blogspot.com/2007/11/blog-post_25.html

ప్రకటనలు