ప్రళయ దినం ముందున్నది…
-అల్లం నారాయణ

ఊరూరికి పాటపాడి తెలంగాణన్నరు. నమ్మినోళ్లు చాలా మంది ఊరేగింపులన్నరు. వీధులన్ని మళ్లీ పెనుకేకలయినయి. తెలంగాణల మల్లా లడాయి జోరుగైనది. ఉద్యమాల మాల గుచ్చి అమర వీరుల కేస్తరు. ఆ త్యాగఫలం ఆశజూపి కొందరు నేతలయితరు. కలిసొచ్చి వారు తెలంగాణ దూతలవుతరు. సిద్ధాంతకర్తలు కొందరు తోడుగుంటరు. సై అంటే సై అని మోసాలకు మలాము పూస్తరు.

కొందరు తమ వాగ్దానాలను, దేవుని విషయంలో చేసిన ప్రమాణాలను అతి స్వల్ప మూల్యానికి అమ్ముకుంటారు. ప్రళయదినాన దేవుడు వారివైపు కన్నెత్తి కూడా చూడడు. -ఖురాన్‌

 బహుశా కొందరు చాలా విషయాలు మరచిపోతుంటారు. దేన్ని దేనికోసం ప్రారంభించారో? ఏది ఎందుకు తనకు గౌరవం సమకూర్చి పీఠాలెక్కించిం దో? ఏ కారణం చేత తామొక విభాత సంధ్యలో కాలం మీద వీరులమై కవాతు చేస్తున్నామో మరచిపోతారు. అల్ప విషయాల కోసం అనల్పాన్ని బలిపెడతారు. ఏ ఉద్యమాలు నిన్ను వీరున్ని చేశాయో ఆ ఉద్యమాలను తాకట్టుపెడితే జరిగేదేమిటి? పోనీ ఒరిగేదేమిటి. తెలంగాణ ఒక శతకోటి గాయాల వీణ. వేల మోసాల మాయల గాయాలపాలైన నేల. అసెంబ్లీలో బుద్ధిగా కూచొని ఉన్న గాంధీ విగ్రహం ఎదురుగా ఒక స్థూపం ఉన్నది. అధికారికంగా ఇప్పటికీ అది ఆవిష్క­ృతం కాకుండా అనధికార ధిక్కార స్వరంలా ఉన్నది.

ఆ స్థూపంలో ఎన్నం ఉపేందర్‌ మరి మున్నూటా డెబ్భై మందికి పైబడిన తెలంగాణ అమరవీరుల ‘యాది’ ఉన్నది. ‘మనాది’ ఉన్నది. త్యాగమున్నది. నిండైన తెలంగాణ కల ఒకటున్నది. అది కాలిపోయి కూలిపోయిన వాస్తవంగా మారి హృదయఘోష వినిపిస్తున్నది. నలభై ఏండ్ల క్రితం కొడుకులను పోగొట్టుకున్న తల్లుల దుఃఖపు వెక్కిళ్లు ఉన్నవి. అవి కాల చక్రంలో ప్రతి సందర్భంలోనూ వినిపిస్తున్నవి. గుండె గొంతుకలో కొట్లాడిన ఒక తెలంగాణ ఆత్మ ఉన్నది. గత మొక వారసత్వపు కవాతు కోసం ఎదురు చూస్తూనే ఉన్నది. త్యాగాల చాళ్లు చివరికి రాజకీయపు దుర్గంధంలో మసి బారుతున్నవి. కాంగ్రెస్‌ పార్టీ యాభై ఏళ్ల మోసంతో కలె బారుతున్నది. తెలంగాణ ఆత్మనది బేరసారాల, గెలుపు ఎత్తుగడల సారంగా మార్చి ఉన్నది. మొయిలీ చివరకు అబద్ధాల కోరు అయిండు. తెలంగాణకు ఇక తెడ్డేగతి అని తేల్చి చెప్పిండు. కీలెరిగి ఎవరో ఒక వాత పెట్టిం డు.

అట్లానేనన లేదని నోరెళ్లబెట్టిండు. మొత్తానికి తెలంగాణకు ప్రాణ సంకటం కాంగ్రెస్‌ కది చెలగా టం. తెలుసు తెలుసు ఈ నాటకం. కడప వాసి రాజశేఖర రెడ్డి మాట మొయిలీ నోట చిలక పలుకులయ్యిం ది. మరోసారి మరోసారి, మరోసారి తెలంగాణ అరిగోస పడింది. పీఠం ఎక్కేదాక తెలంగాణ ముద్దుగున్నది. దోచుకోను తెలంగాణ బొద్దుగున్నది. హైదరాబాద్‌ బిర్యానీ భలె రంజుగున్నది. రింగురోడ్డు పంట భూములన్ని కమ్ముకున్నవి. సగం హైదరాబాద్‌లో వై.ఎస్‌ బాటలున్నవి. హైదరాబాదోని బతుకుల బీటలున్నవి. మొదటి మోసం నాలుగున్నరేండ్లది. దాని వయస్సు అంతకంటే పెద్దగున్నది. విశాలాంధ్ర నుంచీ అది సాగుతున్నది. రెండో మోసానికిపుడు రెక్కలున్నవి. కూటములు కట్టినప్పుడే అవి తేటగున్నవి. తెలంగాణ ద్రోహుల పార్టీ ఇప్పుడు మిత్రుడైనది. తెలంగాణ వద్దన్న సమైక్య పార్టీ ముద్దైనది. నారాయణ, రాఘవులు నవ్వుతున్నరు. ఏడ్వలేక కేసీ ఆరూ పగలబడి నవ్వుతున్నడు.

చంద్రబాబు నాయుడుకు మజా గున్నది. ఆయనకూ ఇప్పుడు మొఖం నిండ నవ్వులున్నవి. కడప రాజశేఖరరెడ్డికి, చిత్తూరు చంద్రబాబునాయుడుకు మధ్యలో లడాయున్నది. మన చంద్రశేఖర్‌ ఇద్దరి మధ్యన గద్దె దింపి ఎక్కించే ‘కింగ్‌ మేకర్‌’ అయినడు. ఇక ముందుముందు చంద్రబాబు రానెవస్తడు. వచ్చినంక తెలంగాణ తేల్చివేస్తడు. ఆయన మామగారి పాట ఒకటి ‘తెలుగుజాతి’ మీద ఉన్నది. ఆయన పార్టీలోని రోజా మాట నైసుగున్నది. ‘రాత్రి బారు…పగలు దర్బారు’ అన్నది. కేసీఆరిప్పుడు ఆ ముగ్గురి మధ్య ఇరుక్కుని సిద్ధాంతాల్‌ చేస్త ఉన్నడు. ప.గో,లో పుట్టిన ఒక సినిమయాక్టరు. ఆయనిప్పు డు తెలంగాణకు దేవ దేవుడు. దేవేందర్‌ తెచ్చే సామాజిక తెలంగాణకు ఊపిరులిచ్చి ఊదే మహా యోధు డు. అబ్బ. ఏమి తెలంగాణ సౌభాగ్యము. కడప నుంచి, చిత్తూరు నుంచి, ప.గో. నుంచి నలుమూలల నుంచి తెలంగాణ తెస్తనన్నరు. ఇంక అడ్డమేమి? తెలంగాణ జనమంతా తెడ్డెమన్నరు.

జరుగుతున్న మోసాలకు కడుపు రగులుతున్నది. తెలంగాణ స్థూపం మీద వాడిపోని ఆత్మలున్నవి. వాటిపేరు బెల్లి లలిత ఖండిత అవయవాల మీద చెక్కి ఉన్నది. కనకాచారి మదిల మాట మెదులుతున్నది. ఆ మున్నూటా డెబ్భై మంది ఆత్మలను ఒక ఉద్యమం ఆవాహన అన్నది. గద్దర్‌ భుజం మీద అది గొంగడైనది. ఊరూరికి పాటపాడి తెలంగాణన్నరు. నమ్మినోళ్లు చాలా మంది ఊరేగింపులన్నరు. వీధులన్ని మళ్లీ పెనుకేకలయినయి. తెలంగాణల మల్లా లడాయి జోరుగైనది. ఉద్యమాల మాల గుచ్చి అమర వీరుల కేస్తరు. ఆ త్యాగఫలం ఆశజూపి కొందరు నేతలయితరు. కలిసొచ్చి వారు తెలంగాణ దూతలవుతరు. సిద్ధాంతకర్తలు కొందరు తోడుగుంటరు. సై అంటే సై అని మోసాలకు మలాము పూస్తరు. ఉద్యమం ఊపు మీద తేలొచ్చిన కేసీఆర్‌లూ, కొసాఖరికి తెలంగాణ త్యాగాలను తాకట్టు పెడ్తరు. ఏడ తెలంగాణ తల్లడిల్లే తెలంగాణ దగా పడే తెలంగాణ.

దిగులుగుంది తెలంగాణ. బుగులుపడ్డ తెలంగాణ ఉద్యమాల పంట కేసీఆరు కోసుకుంటడు. తెలంగాణ మరిచి ఇష్టమొచ్చినట్టు చేస్తడు. బేఫికర్‌గ మాట మారుస్తు ఉంటడు. అదేందంటె బొండిగ కోసుకుంటనంటడు. మాటలు నేర్చినోళ్ల పాలబడ్డ తెలంగాణ కుములుతున్నది. దారి తెన్ను కానరాక దగా పడ్డది. అయితేనేం. దసరానాడు పాలపిట్ట రూపు కడ్తది. అది తెలంగాణ పాటలై ప్రవాహమైతది. జమ్మి చెట్టు మీద మూటకట్టిన జాంబియున్నది. అది ఆయుధమై ఎప్పుడైన అందివస్తది. ఛలో ధూమ్‌ధామ్‌, ఛలో ధూమ్‌ధామ్‌.. మత్తడి దుంకి అలుగు తన్నుకుని పారినట్టు, మెత్తటి గుండె లు సైతం నగారై మోగినట్టు,

నెత్తిన బోనమెత్తి శివసత్తులు దుంకినట్టు… ఛలో ధూమ్‌ధామ్‌ తెలంగాణ జాతరొచ్చెరా.. ఓట్ల సీట్ల లెక్కల్లో ఇరుక్కున్న తెలంగాణ, వికృత, అపవిత్ర పొత్తుల్లో ఇరుక్కున్న తెలంగాణను విముక్తం చేసినప్పుడే ఆ స్థూపంలోని ఆత్మల అగ్ని చల్లారుతుంది. వారసత్వం రాబోయే ఉద్యమాలది. ద్రోహం రాజకీయ పార్టీలది. వై.ఎస్‌, చంద్రబాబు, చిరంజీవి ఎవరైతేనేం… అంతా ఒకే తాను ముక్కలే.. ‘గులామ్‌కీ జిందగీ సే మౌత్‌ అచ్ఛీ హై…’ అంటున్నరు అలనాటి రంగారెడ్డి.. ఇదీ అవ్వల్‌.. అస్సల్‌ తెలంగాణ. ప్రళయదినం ముందున్నది.

source :  andhra jyothy,  17 Jan 2009

ప్రకటనలు