అవును ఓడిపోయిన
ఆడీ ఆడీ ఓడిపోయిన…
జనం ‘ప్రభంజన’మౌతారనే
ఆశ అడుగంటి ‘అలిసిపోయిన’…
తోటిమనిషి బాగుకోరే మనసు
మాయమైన జాడలు తెలుసుకొని
‘లొంగిపోయిన’…
ఎవని కొరకు ఎవడూ
బతుకలేడని అర్థమైనంక
‘ఎవ్వనికి బుట్టిన బిడ్డంటే ఎక్కిపడి
ఏడ్సుడెందుక’ని ఎనకకు తగ్గిన…
పిట్టలకంటే అధ్వానంగా
మనుషులు సచ్చిపడుతుంటే
శవాల సంఖ్య తెలుసుకోవడానికి మాత్రమే
‘తపన’పడే మధ్య తరగతి
మందబుద్దికి మోకరిల్లిన..
కడుపుతీపి పంచలేక..
కడుపుకోత తుంచలేక..
అమ్మయ్యలాగమైతాంటే..
ఆగి..ఆగి..
ఆగ ‘మైదా(నా)ని’ కొచ్చిన..
జీవితమే ఆరాటమైనపుడు
బువ్వ దొరుకుడే పోరాటమైనపుడు
ప్రజాజీవనమే అరణ్యవాసమైనపుడు
సాటి మనిషే వర్గశత్రువై
సాయిధపోరాటం చేయవలిసినపుడు
పురుగుమందులు
నేతగుడ్డలే
ఎన్ కౌంటర్లు చేస్తున్నపుడు…
ఎలుగెత్తే గొంతులే పాలకుల
కౌలుగుల్లో జొరబడుతున్నపుడు
ఆపదకు అక్కరకు రావల్సిన
చేతులే ఔతలకెల్లగొడుతున్నపడు
‘ఊరికి చేసిన సేవ
శవానికి చేసిన సింగారమై’నపుడు
అడివెందుకు? నేల మాళిగలెందుకు?
ఏ.కే ఫార్టీ సెవెన్లెందుకు?
‘జీవం’ పోయిన శరీరంతో
పోరాడలేక ‘జనజీవనం’లో కొచ్చిన
అవును ఓడిపోయిన…
ఆడీ ఆడీ ఓడిపోయిన…

 
రమేశ్ హజారి
ప్రోగ్రెసివ్ మీడియా సెంటర్ ,హైదరాబాద్

ఆంధ్రజ్యోతి 18 ఫిబ్రవరి 2009

ప్రకటనలు