బతికుండి మేం సత్తున్నం!

అన్నదాత అడుగడుగునా దగా పడుతున్నాడు. అప్పుల పాలవుతున్నాడు. ఆ విషవలయంలో చిక్కి శల్యమై చివరకు చావును ఆశ్రయిస్తున్న రైతులెందరో. బాధలను భరించలేక రైతు ప్రాణం తీసుకుంటే అతడిపైనే ఆధారపడిన ఆ కుటుంబం పరిస్థితి ఏమటి? అతని భార్య, బిడ్డల భవిష్యత్తు ఏమిటి? తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఆరు నెలల క్రిత ం తన భర్త యెల్చెట్టి భోజన్న పంటను బతికించుకోవాలని కొనుక్కున్న పురుగుల మందు తనే తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య రాజమణి పుట్టెడు కష్టాల మధ్య ఒంటరిగా మిగిలింది. అన్నదాత ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనే వివరాలు రాజమణి మాటల్లో….
ఆనాడు రాత్తిరి ఎప్పటిమల్లెనే పనిజేసుకుని మా ఇంటి ముందోళ్లింట్ల అరుగు మీద ఆడోళ్లమంత బీడీలు చేసుకుంట కూసున్నాం. పదింపావు, పదిన్నర అయిందనుకుంటా….’ మీ ఆయన మందు తాగిండు..కిందపడి కొట్టుకుంటున్నడ’ని సుట్టు పక్కలోళ్లందరొచ్చి మొత్తుకోవట్టే (అరిచారు). ముందుగలయితే నాకేమీ అర్థంకాలే.

‘అయ్యో నీ మొగడు మందు తాగిండటనే’ అని నాతోటి బీడీలు జేసేటోళ్లు నా సుట్టూ సేరి మొత్తుకుంటుంటే గప్పుడు తెలిసింది. సుట్టుపక్కల మొగోళ్లే ముందుకొచ్చి 108 అంబులెన్స్‌కి ఫోన్ చేసిండ్రు. అంబులెన్స్ వొచ్చెటాలకే పానం (ప్రాణం)బోయింది. మా ఇంటి పెద్ద చనిపోయి ఇప్పటికి ఐదునెల్లు అయితుంది.

రైతు రుణవిమోసన సట్టం కింద సర్కారు పైసలిస్తరంటే దరఖాస్తు పెట్టిన. ఆయన పేరు మీద పొలం లేదు కాబట్టి ఆయన రైతే కాదని రిపోర్ట్ రాసిండ్రు. గింత అన్యాయం యేడన్నా ఉంటదా? నడుమ నాలుగు సంవత్సరాలు తప్ప బుద్ధి తెలిసిన నాటి నుంచీ యెవసాయాన్నే నమ్ముకున్నోడిని రైతే కాదంటే మా కట్టం ఓల్లకు జెప్పుకోవాల?

కలిసిరాలేదు
మాది ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం. మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఒక అన్న ఉన్నడు. మా అందరి పొత్తుల (ఉమ్మడి) నాలుగు బిగాల (ఎకరాల) పొలముంది. మా చెల్లెలు పెళ్లయినంక పొలం పంచుదమని అట్లనే అందరి పొత్తుల ఉంచిండు మా అయ్య. నా లగ్గమై19 ఏండ్లయితుంది. లగ్గమైనప్పటి నుంచీ అట్ల పొత్తుల పొలం చేసుకుంటనే ఉన్నం.

యెవసాయం మాకేనాడు కలిసిరాలేదు. మొదటిసందీ పత్తి పంటనే ఏసినం. పంటేసినాంక కొంచెం పెరిగేటాలకే పురుగు తగిలేది. యేముంది? పంటంతా లాస్. సేసిన కట్టం ఎన్నడూ మిగలలేదు. సొంత పొలంల ఇట్లయితుందని నడమల వేరోల్ల పొలం కూడా కౌలుకి దీసుకుని చేసినం. అండ్లసుక (అందులో కూడా) పత్తే ఏసినం. అప్పుడూ పురుగే. అప్పులు చేసి పంటలేసుకుంటుంటిమి పంటపండితే అప్పులు దీరుస్తమనే ధైర్యంతో. పంటేడిది? మన్నేడిది? (పంటా?మన్నా?) పురుగు తగులుడు..పంట గంగల కలుసుడు. ఏండ్ల సందీ గింతే మా బతుకులు. అప్పులు మాత్రం మస్తుగ పెరుగవట్టే. (మరింత…)

ప్రకటనలు