బతికుండి మేం సత్తున్నం!

అన్నదాత అడుగడుగునా దగా పడుతున్నాడు. అప్పుల పాలవుతున్నాడు. ఆ విషవలయంలో చిక్కి శల్యమై చివరకు చావును ఆశ్రయిస్తున్న రైతులెందరో. బాధలను భరించలేక రైతు ప్రాణం తీసుకుంటే అతడిపైనే ఆధారపడిన ఆ కుటుంబం పరిస్థితి ఏమటి? అతని భార్య, బిడ్డల భవిష్యత్తు ఏమిటి? తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఆరు నెలల క్రిత ం తన భర్త యెల్చెట్టి భోజన్న పంటను బతికించుకోవాలని కొనుక్కున్న పురుగుల మందు తనే తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య రాజమణి పుట్టెడు కష్టాల మధ్య ఒంటరిగా మిగిలింది. అన్నదాత ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనే వివరాలు రాజమణి మాటల్లో….
ఆనాడు రాత్తిరి ఎప్పటిమల్లెనే పనిజేసుకుని మా ఇంటి ముందోళ్లింట్ల అరుగు మీద ఆడోళ్లమంత బీడీలు చేసుకుంట కూసున్నాం. పదింపావు, పదిన్నర అయిందనుకుంటా….’ మీ ఆయన మందు తాగిండు..కిందపడి కొట్టుకుంటున్నడ’ని సుట్టు పక్కలోళ్లందరొచ్చి మొత్తుకోవట్టే (అరిచారు). ముందుగలయితే నాకేమీ అర్థంకాలే.

‘అయ్యో నీ మొగడు మందు తాగిండటనే’ అని నాతోటి బీడీలు జేసేటోళ్లు నా సుట్టూ సేరి మొత్తుకుంటుంటే గప్పుడు తెలిసింది. సుట్టుపక్కల మొగోళ్లే ముందుకొచ్చి 108 అంబులెన్స్‌కి ఫోన్ చేసిండ్రు. అంబులెన్స్ వొచ్చెటాలకే పానం (ప్రాణం)బోయింది. మా ఇంటి పెద్ద చనిపోయి ఇప్పటికి ఐదునెల్లు అయితుంది.

రైతు రుణవిమోసన సట్టం కింద సర్కారు పైసలిస్తరంటే దరఖాస్తు పెట్టిన. ఆయన పేరు మీద పొలం లేదు కాబట్టి ఆయన రైతే కాదని రిపోర్ట్ రాసిండ్రు. గింత అన్యాయం యేడన్నా ఉంటదా? నడుమ నాలుగు సంవత్సరాలు తప్ప బుద్ధి తెలిసిన నాటి నుంచీ యెవసాయాన్నే నమ్ముకున్నోడిని రైతే కాదంటే మా కట్టం ఓల్లకు జెప్పుకోవాల?

కలిసిరాలేదు
మాది ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం. మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఒక అన్న ఉన్నడు. మా అందరి పొత్తుల (ఉమ్మడి) నాలుగు బిగాల (ఎకరాల) పొలముంది. మా చెల్లెలు పెళ్లయినంక పొలం పంచుదమని అట్లనే అందరి పొత్తుల ఉంచిండు మా అయ్య. నా లగ్గమై19 ఏండ్లయితుంది. లగ్గమైనప్పటి నుంచీ అట్ల పొత్తుల పొలం చేసుకుంటనే ఉన్నం.

యెవసాయం మాకేనాడు కలిసిరాలేదు. మొదటిసందీ పత్తి పంటనే ఏసినం. పంటేసినాంక కొంచెం పెరిగేటాలకే పురుగు తగిలేది. యేముంది? పంటంతా లాస్. సేసిన కట్టం ఎన్నడూ మిగలలేదు. సొంత పొలంల ఇట్లయితుందని నడమల వేరోల్ల పొలం కూడా కౌలుకి దీసుకుని చేసినం. అండ్లసుక (అందులో కూడా) పత్తే ఏసినం. అప్పుడూ పురుగే. అప్పులు చేసి పంటలేసుకుంటుంటిమి పంటపండితే అప్పులు దీరుస్తమనే ధైర్యంతో. పంటేడిది? మన్నేడిది? (పంటా?మన్నా?) పురుగు తగులుడు..పంట గంగల కలుసుడు. ఏండ్ల సందీ గింతే మా బతుకులు. అప్పులు మాత్రం మస్తుగ పెరుగవట్టే.
దుబాయ్ దారి
‘ఏ….యెవసాయంని నమ్ముకుంటే మట్టే మిగులుతుంది. గల్ఫ్‌కి పొయ్యి పనిజేసుకుంటే నాలుగు పైసలొస్తయి, అప్పులన్నా దీరతాయి. ఇద్దరు మగపిల్లగాండ్లుంటే..అల్ల సదువులకన్నా పైసలు అక్కరకొస్తయ’ని (ఉపయోగపడతాయని) 2003లో అనుకుంటా నా పెనిమిటి దుబాయ్ పోయిండు. ఆడ మేస్త్రీ పనిజేసిండు. పోయినంక ఒక్క యేడాదే పైసలు పంపిండు.

గంతే. మల్ల ఒక్క పైసా పంపలే. ఈడ మల్లా అప్పులు జేసుకుంట ముందుగల జేసిన అప్పులు తీరుస్తుంటి నేను. బీడీలు జేసుకుంట ఇల్లు ఎల్లదీస్తుంటి. ఎన్ని రోజులిట్లని మా ఆయన ఫోన్ జేసినప్పుడల్లా ‘పైసలు పంపుతలేవు, అప్పులు పెరుగుతున్నయి, యెవసాయమూ మూలకువడే. ఏందీమరి ఎట్లజేద్దమనుకుంటున్నవ్?’ అని అడుగుతుంటి. ‘ఈడ పని దొరుకుతలేదు. తినటందుకే కట్టమైతుంది. ఇగ ఆడికెట్ల పంపాలే’ అని బాధపడుతుండె. లాస్ట్‌కు ఎన్నేండ్లున్నా పని దొరకదు అప్పులైతే పెరుగుతున్నయి, ఊరుకొచ్చి మల్లా యెవసాయం జేసుకుంటేనే నయమని నాలుగేండ్లకే మల్లా అచ్చేసిండు ఊరికి.

అదే తంతు
మా ఆయన దుబాయ్ నుంచి అచ్చినంక యెవసాయం చేయనీకి అందినకాడ అప్పులు జేసుకుని మల్లా పత్తేసినం. ఈసారన్న మంచిగ పండి పంట చేతికొస్తే అప్పులు కొన్నయినా తీర్తయని అనుకున్నం. కానరాని దేవుళ్లకి దండాలు పెట్టుకున్నం. ఏ దేవుడు మామీద దయ జూపలేదు. కొంచెం పెరిగిందో లేదో పత్తికి పురుగువట్టుకుంది. పంటంతా నాశనం. అప్పులకు వడ్డీలు, ఆ వడ్డీలకు వడ్డీలు పెద్ద గుట్టలాగా పేర్కపోయినయ్.

ఏడ్వని రోజు లేదు. నేను, నా పెనిమిటి కొన్ని దినాలు అన్నం మెతుకు మింగితే ఒట్టు. పంట కరాబైతే (పాడైతే)అప్పులిచ్చినోల్లకేం బాధ, అప్పుదీర్సకపోతే ఊకోరు కదా (ఊరుకోరు కదా). ఏమైనా ఆల్ల అప్పులు తీర్సాల్సిందే. ‘దేవుడెందుకు మన మీద పగపట్టిండే.

యెవసాయం మొదలువెట్టిన నాటి సందీ ఇయ్యాల్టిదాకా ఏనాడు పంట సరిగ్గా పండలేదు. దానిమీద జేసిన అప్పు తీరలేదు. ఎంద దురదృష్టవంతులం. మన కడుపున పుట్టిన పిల్లలెంత నట్టజాతకులే, మనలాంటి బతుకు ఓల్లకుండద్దు (ఎవరికి ఉండొద్దు) అని ఒక రోజు బగ్గ (చాలా) బాధపడ్డడు. ‘ఊకో..మన కష్టాలెప్పటికీ ఇట్టనే ఉంటయా’ అని సముదాయించిన. ఆరోజే రాత్రికి పురుగుల మందు తాగి సచ్చిపోయిండు (అంటూ ఏడ్చింది). గిట్ల మందుతాగి సత్తడని అనుకోలేదు. నన్ను, పిల్లలను అనాథలను జేసిపోయిండు.

రైతే కాదన్నారు
నా భర్త సచ్చిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నా. అప్పులోల్లు మెడమీద కూసున్నారు పైసల కోసం. ఇద్దరు కొడుకులు. ఒకడు పన్నెండు సదువుతున్నడు, ఇంకోడు ఎనిమిది సదువుతున్నడు. సిన్నోళ్లే. తండ్రి లేడన్న బాధ తప్ప ఇంకా కష్టాలేం తెల్సు ఆల్లకు? ఒక్కదాన్నే తిరుగుతున్న ఎట్లయిన అప్పుదీర్చాల్ననే. రైతు రుణవిమోసన సట్టం కింద సర్కారు పైసలిస్తరంటే దరఖాస్తు పెట్టిన.

ఆయన పేరు మీద పొలం లేదు కాబట్టి ఆయన రైతే కాదని రిపోర్ట్ రాసిండ్రు. గింత అన్యాయం యేడన్నా ఉంటదా? నడుమ నాలుగు సంవత్సరాలు తప్ప బుద్ధి తెలిసిన నాటి నుంచీ యెవసాయాన్నే నమ్ముకున్నోడిని రైతే కాదంటే మా కట్టం ఓల్లకు జెప్పుకోవాల? సచ్చి మా ఆయన మారాజయిండు. బతికి మేము సత్తున్నం. మా ఒక్కల్ల పరిస్థితే కాదు ఊళ్లల్ల ఇంచుమించు అందరి రైతుల పరిస్థితి గింతే. మా బతుకులు ఎన్నడు బాగుపడతయి? తిండిగింజలు పండించేటోళ్లకే తిండి లేని దినమొచ్చే. గింత పాపమా?’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఎల్చెట్టి రాజమణి.

సరస్వతి రమ

Andhra Jyothi,  26 April 2010

ప్రకటనలు