పోలవరం సంక్షోభం ఎస్ ఈ డబ్ల్యూ కి పరిమతమైతే బానే ఉండేది. ఇది మరో గోదారి స్పెక్ట్రం కుంభకోణం లెక్క అవినీతి, ఆరోపణలు, విచారణలు. వాస్తవాలు తేలినతర్వాత దొరలెవరో దొంగలెవరో నల్గురు వార్తలు చదివి పుర్సత్తుగా మాట్లాడుకొంటరు.

కథ అక్కడ ఆగలేదు. కనుకనే చర్చ. విమర్శ. ఖండనలు. పోలవరం వివాదంలో ఎన్నెన్ని రాజకీయాలో. ప్రస్థుతానికి కొన్నింటిని తప్పనిసరిగా ఆలోచించాలి.

ప్రశ్న ఏంది? జలయగ్నం పేరుతో సాగిన బలియగ్నంలో వాటదారులైన కాంట్రాక్టరు (ఎస్ ఈ డబ్ల్యు) టీ ఆర్ ఎస్ కు బంధువెట్లాయె? నాలుగు పైసలకోసం ఓ క్రిమినల్ ప్రాజెక్టును కట్టి తూర్పు కనుమలను, కోయ జాతిని ఖూని చేసేందుకు ఉవ్వీల్లూరే కాంట్రక్టర్లు పోలవరం మీద యుద్దమే చేసే వాళ్ళకు మిత్రులెట్లాయె. నమస్కారం చేయడానికి ముఖ్యుడెట్లాయే

ఇపుడొస్తున్న ఆరోపణలకు జవాబు చెప్పకుండ వేరేవాళ్ళమీద అరిస్తే లాభం లేదు.
పోలవరం ప్రాజెకుపైన తెలుగు దేశం పార్టి వైఖరేంది అని అడిగితే ఏముంటది ఆన్సరు. ఆ విషయం 2009 ఎన్నికల్లొ టీ డీ పీ తోని పొత్తుకూడినప్పుడు అడిగిండ్ల? టీ డీపీ అప్పుడున్న వైకరినుంచి ఈ మధ్య ఏమైన మార్చుకొందా?

పార్టీ, ఉద్యమం, ఉద్యమ దిన పత్రికలకు వాటిని నడిపే వ్యక్తుల వ్యాపారాలతో సంబంధం లేదు అనే ప్రయత్నం కూడా పనికి రాదు. రాజకీయాలు వేరు బిజినెస్సు వేరు అనుకొంటే ఎవరితోనైనా సహజీవనమో భాగస్వామ్యమో చెయ్యొచ్చా? అట్లనే నమస్తే తెలంగాణ పార్టునరైన సీ ఎల్ రాజం కు పోలవరం కాంట్రాక్టు తెచ్చుకొన్న కంపెనీలో 3 శాతం వాటానేనటకదా అని, రాష్ట్రాన్ని దోచుకొన్న జలయగ్నం విషం లో ఆ కంపెనీకి కొంతవాటానేనట అంటే ఏమన్నట్లు? అన్యాయం లో ఎంత వాట ఉంటే అక్రమము అవుతుదంట? అన్యాయంలో ఎంత మోతాదు మించకపోతే అభిలషనీయము సమర్థనీయము అవుతుంది.

మాటలకు మాటలు పక్కకు బెట్టి ఆచరణలో కావాల్సినవి:

–ఏ అనుమతుల్లేని పోలవరం ప్రాజెక్టును అక్రమ పద్దతిలో కదిలించడానికి చూస్తున్న కుట్రలను ఆపేందుకు ఈ టెండర్లను రద్దు చేసేందుకు ఉద్యమించడం;
— పోలవరం ప్రాజెక్టుతో పడ్డ మచ్చను తుడిచేయడానికి ఆ ప్రాజెక్తును రద్దుచేసేంతవరకు నేలపైన ఉద్యమం చేపట్టడం.
— రాజంకు నమస్తే తెలంగాణ కావాలో ఎస్ ఈ డబ్ల్యూ కావాలో తేల్చుకోడం;
— నమస్తే తెలంగాణకు జలయగ్నం కాంట్రాక్టరు రాజం కావాలో పోలవరం మీద పోరు కావాలో తేల్చుకోడం

సూటి ప్రశ్నలకు సూటి జవాబులు కావాలే? అపుడే ప్రజల్లో ఉన్న అనుమానాలు తగ్గుతయి, కొత్తగా మల్ల నమ్మకం ఏర్పడుతుంది. డొంకతిరుగుడో, గారడో చేస్తే లాభం లేదు. దాని వల్ల దెబ్బతిన్న నమ్మకం తిరిగి రాదు. మేము ఏదో వ్యక్తుల్లాగానో, ఒక స్వచ్చంధ సంస్థ లాగనో పోరాడినమని చెప్పుకుంటే దానికి గుర్తుగా నాలుగు పత్రికా ప్రకటనలు చూపిస్తే ప్రయోజనం ఏమి? ఆదివాసుల కోసం, పేద ప్రజల కోసం, తెలంగాణ కోసం ఖచ్చితమైన ఆలోచనను ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలే. అపుడే ఆంధ్ర వలవాదులు కుట్రపూరితంగా గోదారిని దారిమల్లిస్తుంటే ఆపినట్టు, నీరులేక కన్నీరుపెట్టే ఇక్కడి రైతు ఆకాకంక్షను గౌరవించినట్టు. అపుడే కోయజాతి మెడపైన వేలాడుతున్న బంగారు కత్తినుంచి నిజమైన విముక్తి. ఇపుడు నీళ్ళు నిజాలు తేలితేనే తెలంగాణకు మేలు.

భరత్ భూషణ్

ప్రకటనలు